Friday, April 2, 2010

Sunday, November 30, 2008

Saturday, November 29, 2008

నాయకుడు kaavaali

నిజం.
ఇప్పుడు మనకు కావలసింది సరైన సమాధానం చెప్పగల తెగువ చేవ మాత్రమే.
ప్రపంచదేశాలెన్నో మనకిప్పుడు ఓదార్పు వచనాలెన్నో పలుకుతున్నాయి.
కొన్ని తరువాత సహనం వహించమని కూడా సలహాలెన్నో అడగకుండా గుప్పించవచ్చు.
మనకీ మిగిలిన ప్రపంచదేశాల సహకారం మద్దతూ ఏమీ అవసరం లేదు. వద్దు.

ఇది మన సమస్య.
మనం మునిగి పోతున్నాం.
ఒడ్డున కూర్చుని సలహాలు చెప్పేవాళ్ళు ఏమైనా చెబుతారు.
కానీ ఈత తెలిసినా తెలియకపోయినా బయటపడేందుకు విశ్వప్రయత్నం చేయవలసిందే.
నడిసముద్రంలో ఉన్నా దరి ఏమీ కానరాకపోయినా ఈతకొట్టడం మానే ప్రసక్తి ఉండరాదు.
తిమింగిలాలు మింగేస్తాయేమో సొరచేపలు కమ్మేస్తాయేమో అనే భయం మూర్ఖత్వం.
మనం ఈత కొట్టడం మానివేస్తే అవి మనలను మన్నించి మన జోలికి రావడం మానేస్తాయా?

మన ముందు తరం వారు మనకు కాశ్మీరు సమస్యను కానుకగా అందించినట్టు మనం ఈ భయంకర ఉగ్రవాద సమస్యను మన భావి తరాల వారికి మనం అందించి వెళ్ళరాదు.
ఇది మన తరంలో తలెత్తిన సమస్య.
దీనిని మనమే తుద ముట్టించాలి.

నేడు భారతీయ యువకులందరూ కోపావేశాలతో ఉడికిపోతున్నారు.
ప్రతీకారవాంఛతో రగిలిపోతున్నారు.
వీరి ప్రచండశక్తిని వజ్రాయుధంగా మార్చి ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలించివేయగల సమర్థుడైన నాయకుడు కావాలి.
వద్దు బాబోయ్ వద్దు. మాకు గౌతమ బుద్ధుడు వద్దు. క్రీస్తు గారి శాంతిపాఠాలు వద్దు. గాంధీగిరీ వద్దే వద్దు.
అభిమన్యుని మరణానికి ప్రతీకారంగా మరుసటి సాయంత్రానికే శత్రువును మట్టుబెట్టిన అర్జునుడే మాకు ఆదర్శం.
తుది బుల్లెట్ వరకు పోరాడిన చంద్రశేఖర్ ఆజాద్ మనకు స్ఫూర్తి.
గాంధీ గారి పాఠాలను ప్రక్కకు నెట్టి సమరనినాదం చేసిన సుభాష్ మనకు మార్గదర్శి.

ఓ భారతీయులారా, మనకోసం కాదు, మన పిల్లల కోసం ఆలోచించండి.
మన పిల్లల జీవితాలను రక్షించేది ఇన్స్యురెన్స్ పాలసీలు కాదు.
మన జాతిని రక్షించేందుకు ఉద్యమించే నవయువకులు మాత్రమే.
వారిని ప్రోత్సహించండి.
వారికి పిరికి మందు నూరి పోయకండి.
మేము కూడా మీ వయసులో ఇలా ఆవేశపడిన వారమే అంటూ వెక్కిరించకండి.
వారిని నిస్తేజ పరచకండి.

mana సమస్యకు తక్షణ పరిష్కారం మనం కనుగోనలేకపోవచ్చు.
ప్రతీకారం చప్పున తీర్చుకోలేక పోవచ్చు.
కానీ, మన పిల్లలు మనంతటి వారయ్యే రోజు తప్పక వస్తుంది.
అప్పుడు చూడండి.
ఉగ్రవాదులు మన దేశం గూర్చి ఆలోచన చేసేందుకే భయపడుతారు.
భారత్ అనే పేరు కలలో వినిపించినా నిద్రలోనే గుండె ఆగి చస్తారు.

జై
హింద్ జై హింద్ జై హింద్.
( ముంబై లో మాతృదేశ రక్షణ కోసం అసువులర్పించిన అమరవీరులకు జోహార్. మేము మీ ప్రయత్నాలను వృథా కానివ్వం. మేము భారతీయులం.)

Thursday, November 27, 2008

ఎవరండీ మనకు ఆదర్శం?

మన దేశం లో ప్రతి బాలుడూ బడికి వెళ్లి బలపం పట్టుకునే రోజుల్లోనే కత్తిసామూ కర్రసామూ నేర్చుకున్న రోజులను మనం చీకటి రోజులని ఎందుకనుకోవాలి?
హర హర మహాదేవ అని నినాదాలు చేస్తూ ప్రాణాలను మాతృభూమి రక్షణ కోసం తృణప్రాయంగా భావించి కదన రంగానికి కదను త్రొక్కుతూ వెళ్ళిన ఆనాటి మహావీరులను గూర్చి ఈనాడు మనం తలచుకోనైనా తలచుకొనం ఎందుకని?

తమ కన్నబిడ్డలను ఈనాడు తల్లిదండ్రులైనా సైనికులు కమ్మని ప్రోత్సహిస్తున్నారా?
పుట్టిన వెంటనే మావాడు డాక్టర్ కావాలనో లేదా ఇంజనీర్ అవుతాడనో ముందే కలలు కంటూ, కలలను నిజం చేయమని తమ పిల్లలను అదిలించీ బెదిరించీ హడలు ఎత్తించీ తమ పంతం నెగ్గించుకునే నేటి తల్లిదండ్రులు, సినిమా పేజీలకు కేటాయించిన దాంట్లో సగమైనా ఏనాడూ మన సైన్యం లోని నిజమైన హీరోలను గూర్చి వ్రాయని పత్రికలూ ఈనాడు ముంబై ప్రేలుళ్లకు కేవలం ప్రభుత్వమే అసలైన జవాబుదారీ అంటూ నిందించడం ఎంతవరకు సమంజసం?

ఈనాటి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏనాడైనా సామాజిక బాధ్యతలు ఇవీ అంటూ పరిచయం చేస్తున్నారా?
అసలు తల్లిదంద్రులకైనా అవేమిటో తెలుసా?
డాన్స్ బేబీ డాన్స్ వంటి ప్రోగ్రాముల్లో మావాడికి అన్యాయం జరిగిందని ఏడ్చే తల్లిదండ్రులకు ఇచ్చినంత పబ్లిసిటీ నిజాయితీగా దేశానికి మేలు చేయాలని ఆలోచించే కొంతమంది కుర్రవాళ్ళకు ఎప్పుడైనా మన పత్రికలు పబ్లిసిటీ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా?

పిల్లలు చాలా అమాయకులు.
అందరూ దేనిగురించి మాట్లాడితే మనమూ అలాంటి పనినే చేద్దామని అనుకుంటారు.
ఇప్పుడు సచిన్ ధోనీలదే హవా కాబట్టి పిల్లలు క్రికెట్టే ఆడాలని కోరుకుంటారు.
విశ్వనాథన్ ఆనంద్ సాధించిన విజయాలతో స్ఫూర్తి పొంది తరువాత చదరంగంలో అనేక గ్రాండ్ మాస్టర్లు మనదేశంలో పుట్టుకు రావడం మనం చూడలేదా?

అలాగే, ఫలానా వారి అబ్బాయి ఫలానా కోర్సు చేసి అమెరికాలో ఉద్యోగం వెలగబెడుతున్నాడంటూ పొద్దస్తమానం ఊదరగొడుతుంటే పిల్లలు అదేదో చాలా గొప్ప అనుకుంటూ, తాము కూడా అలాగే చేస్తూ విదేశాలకు పరుగెడుతుంటే మావాడు మమ్మల్ని పట్టించుకొనడం లేదని వాపోయే తల్లిదండ్రుల దేశం మనది.
ఎవరు తీసిన గోతిలో వారే పడడం అంటే ఇలా కాదా?
అమూల్యమైన మన పిల్లల సేవలను అమెరికాకో లేదా మరో దేశానికో ఉదారంగా కొంత ఎక్కువ సొమ్ముకు (జీతానికి) ధారాదత్తం చేయడం దేశద్రోహం కాదా?
ఇల్లరికం వెళ్ళడం అంటే చిన్నతనంగా భావించే మన దేశంలో ఇలా మరో దేశానికి వలసకట్టి పోవడం గొప్పగా భావించేం సంస్కారం అలవడిందని మనం సంతోషించాలా?

ఒకరికోసం ఒకరు అండగా నిలబడడం అనే ఒక ఉత్తమ జాతీయ జీవలక్షణం మన ఉమ్మడి కుటుంబాలతో పాటే నశించిపోయిందని నిట్టూర్చి ఊరుకోవలసిందేనా?
మన కుటుంబంలో వారి మీద దాడి జరుగుతుంటే ఎవరైనా భయపడి పారిపోతారా లేక పౌరుషంతో ప్రాణాలకు తెగించి తమవారిని కాపాడుకోవాలని చూస్తారా?
పిల్లలకు మనం పిరికిమందు నూరి పోస్తున్నామనటం లేదు.
మన పిల్లలకు ఆపదా రాకూడదని వారిని గదిలో పెట్టి తాళం వేస్తూ వారిని భయగ్రస్తులను చేయకపోతే చాలు.

జిమ్ముకి వెళ్లి కసరత్తులు చేసే కండల వీరులెవరైనా ముంబైలో ఉగ్రవాదులను ఏరకంగానైనా ఎదిరించే సాహసం చేసారా? వీరులకు కావలసింది కండబలం కంటే నరనరాలలోనూ సాహసం ఉత్తేజం.
సినిమాలలో వందలాది మందిని అవలీలగా చావబాదేస్తూ ఉండే బాలీవుడ్ హీరోలెవరూ తమను ఆరాధ్యడైవాలుగా కొలిచే తమ అభిమానులను కాపాడుకొనడం కోసం ఇల్లు కదిలి బయటకు రాలేదు మరి !

గొప్ప వీరుల దేశమైన మన భారతదేశపు పతనం బౌద్ధమతంతో ప్రారంభమయింది.
కత్తి పట్టడం అనాగరికమంటూ వీరులను గేలిచేయడం వారితోనే ప్రారంభమైంది.
బౌద్ధసంఘాలలో చేరి బిచ్చమెత్తుకొనడం ఉదాత్తమైన జీవనంగా ప్రస్తుతింపబడింది.
ఆనాటి పొరపాటే మన దేశం అందరికీ లోకువ అయ్యేందుకు దారి తీసింది.
అలెగ్జాండర్ కానివ్వండి, చెంగిజ్ఖాన్ కానివ్వండి, ఒక ఘోరి మహమ్మదు కానివ్వండి, గజనీ మహమ్మదు మరో బాబరు వీరంతా భారత దేశంవైపు కన్నెత్తి చూడగలిగే సాహసం చేశారంటే దానికి బుద్ధుని బోధలలో మంచిచెడులను అవగతం చేసుకోలేని భారతీయుల అమాయికత్వమే కారణం.
పృథ్వీరాజు వల్లమాలిన క్షమాగుణం ప్రదర్శించి ఉండకపోతే పరాయి పాలకుల చేతులలోకి మన దేశం జారి పోయి ఉండేదా?
అతడు పేరుకు హిందూ రాజే కావచ్చు గాక. అతడిపై బౌద్ధ మత ప్రభావం కాదనలేము.
అలాంటి మితిమీరిన క్షమాగుణాన్నే ఈనాటికీ మన ప్రభుత్వాలు అనుసరించవలసి వస్తోంది.

నిజమే, ఆనాటి సాంఘిక పరిస్థితులే ఆనాడు బౌద్ధ మతం అవతరించేందుకు దారి తీసాయి.
అది తిరుగులేని, కాదనలేని సత్యం.
కాని, తరువాతకాలంలో శంకరాచార్యులవంటి మహాత్ములు వచ్చి ఆనాటి వైదికమతంలో తలెత్తిన వక్రమార్గాలన్నింటినీ ఖండించి గొప్ప సంఘసంస్కరణం చేశారు.
పండుగ ముగిసిన పిమ్మట అంతవరకూ మనం పూజించిన వినాయక విగ్రహాలనే రకంగా మనం నిమజ్జనం చేస్తామో అదే విధంగా శంకరాచార్యుల సంస్కరణల తరువాత బౌద్ధమతాన్ని కూడా మన దేశం త్యజించి ఉండవలసింది.
మన దురదృష్టం కొద్దీ అలా జరుగలేదు.
ఫలితం, మనదేశంలో వీరులకంటే శాంతిప్రియులనే ముసుగులో దాక్కున్న పిరికిపందలకే ఎక్కువ సామాజిక గౌరవం లభించింది.
ఇంకేముంది? తరువాత తరాల పిల్లలందరికీ వారే ఆదర్శపురుషులయ్యారు.
తరతరాలుగా భారతీయ బాలలందరూ బానిసత్వానికి నిస్సహాయంగా బందీలు కావలసి వచ్చింది.
ఈనాటికీ మనలో అదే పిరికితనం గూడు కట్టుకు కూర్చుంది.

అయ్యో, మనం కనీసం ఈనాటికైనా మనకు ఆదర్శపురుషులుగా ఉండవలసింది రాముడు అర్జునుడు శివాజీ వంటి మహావీరులని గుర్తిద్దాం.
శంకరులు, రామానుజులు, వివేకానందుల వంటి నిస్స్వార్థ యోగి పుంగవులు మనకు దార్శనికులని ఇప్పటికైనా నిజం గ్రహిద్దాం.
రామాయణ మహాభారతాలు కట్టుకథలని బ్రిటిషువారు కొట్టి పారవేయడంలోనే మన జాతిని నిర్వీర్యం చేసే గొప్ప కుట్ర దాగి ఉందని ఇప్పటికైనా తెలుల్సు కుందాం.

మన గొప్పతనాన్ని మనం గ్రహించగలిగితే మనం ఒక జాతిగా, భారతీయులుగా మనుగడ కొనసాగించగలుగుతాం.
ఈనాడు దేశంలోని హిందువులైనా, ముస్లిములైనా, సిక్కులైనా, క్రైస్తవులైనా మన అందరికీ మూలపురుషులు ఒక్కరే అని ఒకసారి నిలకడగా ఆలోచించి అర్థం చేసుకుందాం.

సోదరులారా, మనమంతా కలసి బ్రతుకుదాం.
జై హింద్.

(ముంబై హింసాత్మక ఘటనలలో అకాల మరణంచెందిన సోదరులకు, వీరమరణం పొందిన భారతీయులకు ఇది నా శ్రద్ధాంజలి.)

మీవాడు శ్రీనివాస కృష్ణ

Sunday, November 9, 2008

స్వపరిచయం

ఓమ్. శ్రీ మహాగణాధిపతయే నమః.

పెద్దలందరికీ మిత్రులందరికీ హృదయులందరికీ సవినయ ప్రణామాలు.

బ్లాగ్ అంటే ఏమిటో ఇంతకుముందే కొన్ని పుస్తకాలలో చదివాను గాని, ఈ లోకంలో అడుగు పెట్టడం ఇదే మొదటిసారి.
ఆలోచనలు పంచుకొనడం పరిచయాలు పెంచుకొనడం వరకు మాత్రమేనా ఈ బ్లాగులు పనికొచ్చేది?
ఏమో. ఇంకా చాలా లాభాలు ఉండవచ్చు. ఉండే ఉంటాయి.
నష్టాలు కూడా ఉంటాయా?
అయినా, తెగించి నదిలోకి దూకిన తరువాత లోతెంత అని ఆలోచించడం ఎందుకు?
ఈత వచ్చినవాడికి లోతు ఎంతుంటే ఏమిటట అని ఒక సామెత కూడా ఉంది మరి.

ఐనా నేను మరీ భయపడుతున్నవాడిలా ఎందుకు ఆలోచిస్తున్నాను?
రైలెక్కి గంట కూడా కాకపోయినా మన ముందు కూర్చున్న వ్యక్తికి "తింటారా?" అని మనం ఫలమో ఫలహారమో ఇచ్చే ప్రయత్నం చేస్తామే?
అలాంటి తెలుగులోకంలో నాకు భయం ఎందుకు?
ఇంగ్లీషో మరో భాషో ఏదో ఐతే కాస్త భయపడాలి ఎక్కడైనా వ్యాకరణంలో తప్పులు వ్రాస్తానేమో అని.
స్వేచ్చగా రోజూ మాట్లాడే నా మాతృభాషలో నేనెందుకు తప్పులు వ్రాస్తాను?
(నా ఉద్దేశం వ్యాకరణంలో తప్పులు చేయను - అని లెండి. ఒక వేళ చేసినా అది ప్రామాదికమే అయిఉంటుంది.)
అదీ నా ధైర్యం.

మన తెలుగువారికో సాంప్రదాయం కూడా ఉంది కదండీ, అదే - వారసులను పరిచయం చేయడం.
"వీడు మా అబ్బాయి, మా మనుమడు, మా అల్లుడు, నన్ను ఆదరించినట్లే వీడిని కూడా ఆదరించండి, దీవించండి" అని ప్రజలకు పరిచయం చేసే కార్యక్రమం.
మరి ఈలోకంలో (బ్లాగ్లోకంలో) నన్ను అల్లా పరిచయం చేసేవారెవరూ నాకు తెలియదు.
కాబట్టి నన్ను నేనే పరిచయం చేసుకోవాలి.

నా పేరు శ్రీనివాస కృష్ణ.
నేను పుట్టింది పెరిగింది చదువుకుంది అన్నీ విశాఖపట్టణం లోనే.
కాకపోతే, నా మధురమైన బాల్యస్మృతులన్నీ అనంతపురం జిల్లాలోని మా మాతామహుల పితామహుల ఊళ్లోనే ఉండిపోయాయి.
ఆ ముచ్చట్లన్నీ తరువాత ఎపుడైనా వ్రాస్తాను.
కొద్దిగా సంస్కృతం చదువుకున్నాను. ఆ భాషే ఇప్పుడు నాకు జీవనాధారంగా కూడా మారింది.
ఫోటోగ్రఫీ అంటే కొంత మక్కువ నాకు.
గత కొన్ని నెలలుగా ఫ్లికర్ లో నా ఫోటోలు ప్రదర్శిస్తూ ఉన్నాను.
నమ్మగలరా మీరు? ఈరోజే తెలుగుభాషలో ఎలా టైపు చేయాలో నేర్చుకున్నాను.
ఈ రోజే ఇలా బ్లాగ్ కూడా అనుకోకుండా తారస పడింది. ఇంకెందుకు ఆలస్యం అని మొదలు పెట్టేశా.
"శుభస్య శీఘ్రం" అంటారు కదా పెద్దలు.
వారి మాటను మన్నించాలి గదా? (కొన్నిసార్లైనా, మనకు నష్టం లేదనుకున్నప్పుడైనా.)

ఈరోజు ఇంతకంటే ఏమి వ్రాయగలనో తెలియటం లేదు.
"అల్పారంభః క్షేమకరః" అనే మరో పెద్దల మాటను కూడా మన్నించాలి కదా.
ఇలా అన్నింటినీ అందరినీ మన్నించేసే మనసు నాది అని అప్పుడే ఒక నిర్ణయానికి రావద్దు సుమండీ.
చిన్నప్పుడు మహాభారత్ సీరియల్ లో చూశాను.
శత్రువు మీద బాణం వేసేప్పుడు గూడా "సావధాన్" అని హెచ్చరించి వేసేవారట.
అందుకని, ముందే చెబుతున్నాను. (ఎవరూ నా శత్రువులు కాకపోయినా సరే.)
అందరినీ మన్నించే మనసు నాకు లేదు.
(ఆ లెక్కన అలాంటి మనసు ఉంటే గింటే మహాయోగులకు ఉండవచ్చు. నా తప్పేం లేదు.)
ఆహా!
ఇప్పటికి తెలిసింది నేను కూడా మీ అందరిలాంటి వాడినే అని...
సెలవు. మళ్ళీ కలుద్దాం.

మీ
శ్రీనివాస కృష్ణ
09 నవంబర్ 1998